విశాఖలో నేవీ మారథాన్ జోష్.. 18 వేల మంది రన్నర్లతో తీరంలో సందడి

  • విశాఖ బీచ్ రోడ్డులో ఘనంగా జరిగిన నేవీ మారథాన్ 2025
  • నాలుగు విభాగాల్లో సుమారు 18 వేల మంది రన్నర్లు
  • 17 దేశాల నుంచి హాజరైన విదేశీ అథ్లెట్లు
  • మారథాన్‌తో నగరం ఖ్యాతి పెరిగిందన్న జిల్లా కలెక్టర్
  • ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించే ఈవెంట్ అన్న‌ పోలీస్ కమిషనర్
విశాఖపట్నం నగరంలోని బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం వైజాగ్ నేవీ మారథాన్ 2025 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. 17 దేశాలకు చెందిన విదేశీ అథ్లెట్లు కూడా ఈ పరుగులో పాల్గొనడం విశేషం. మొత్తం 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు.

తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ బల్లా 42కే ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించగా, ఆయన సతీమణి ప్రియా బల్లా 21కే రన్‌ను ప్రారంభించారు. 10కే పరుగును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, 5కే పరుగును నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. మారథాన్ నేపథ్యంలో బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా నేవీ మారథాన్ నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళాన్ని అభినందించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఇది 10వ వైజాగ్ నేవీ మారథాన్ అని, కేవలం 5కే పరుగులోనే పదివేల మంది పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. ఇలాంటి ఈవెంట్ల ద్వారా నగరంలో ఫిట్‌నెస్ సంస్కృతి పెరుగుతుందని, దేశంలోనే విశాఖ ఫిట్‌నెస్‌కు రాజధానిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మారథాన్ విశాఖ నగరానికి గర్వకారణమని ఆయన అభివర్ణించారు.


More Telugu News