అమ్మా నేను పారిపోతున్నా.. ఐ లవ్యూ: అమెరికా కాల్పుల ఘటనలో విద్యార్థి మెసేజ్

  • అమెరికా బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం
  • ఘటనలో ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు
  • ఇంకా పరారీలోనే ఉన్న నిందితుడు, క్యాంపస్ లాక్‌డౌన్
  • ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ఇంజినీరింగ్ భవనంలో ఘటన
"అమ్మా, క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయి. నేను పారిపోతున్నా, ఐ లవ్యూ." అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన సమయంలో ఓ విద్యార్థి తన తల్లికి పంపిన సందేశమిది. ఈ ఒక్క మాట అక్కడి భయానక పరిస్థితికి, విద్యార్థుల ఆందోళనకు అద్దం పడుతోంది.

శనివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.05 గంటలకు నల్ల దుస్తులు ధరించిన ఓ దుండగుడు బ్రౌన్ యూనివర్సిటీలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉండటంతో, యూనివర్సిటీని పూర్తిగా లాక్‌డౌన్ చేశారు.

ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ విద్యార్థి జేడెన్ అన్సెల్మో తల్లి షమ్సా అమేర్సీ ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులంతా క్యాంపస్‌లోనే ఉన్నారని, ఆ సమయంలో తన కొడుకు నుంచి ఈ మెసేజ్ వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ శబ్దం రాకుండా చూసుకోమని తాను కొడుక్కి సూచించినట్లు చెప్పారు. జేడెన్ మరో 12 మంది విద్యార్థులతో కలిసి ఓ సప్లై క్లాసెట్‌లో (సామాగ్రి గదిలో) తలదాచుకున్నట్లు ఆమె వివరించారు.

యూనివర్సిటీలోని ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగాలు ఉన్న బారస్ అండ్ హోలీ భవనంలో ఈ దాడి జరిగింది. ఘటన తర్వాత కూడా గంటల తరబడి పోలీసులు క్యాంపస్‌ను జల్లెడ పడుతున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, నిలకడగా ఉందని మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అధికారులు సమాచారం అందించారు. ఎఫ్‌బీఐ రంగంలోకి దిగిందని, నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News