పెళ్లి తర్వాత తొలిసారి.. కెమెరాలకు చిక్కిన సమంత-రాజ్ జంట

  • దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న నటి సమంత
  • పెళ్లి తర్వాత తొలిసారి ముంబై ఎయిర్‌పోర్టులో జంటగా ప్రత్యక్షం
  • ఈ నెల‌ 1న కోయంబత్తూర్‌ ఇషా ఫౌండేషన్‌లో వీరి వివాహం
  • ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేస్తున్న జంట
దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత నటి సమంత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ నూతన జంట కెమెరాల కంటపడింది. చాలా సింపుల్‌గా, సాధారణ దుస్తుల్లో కనిపించిన వీరిని చూసి ఫోటోగ్రాఫర్లు శుభాకాంక్షలు తెలిపారు. దానికి వారు చిరునవ్వుతో ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ నెల‌ 1న కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో లింగ భైరవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్‌తో ధ్రువీకరించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన వీరి పెళ్లి వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.

గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పుకార్లు వినిపిస్తున్నా, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ సెట్‌లో మొదలైన వీరి పరిచయం, 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రాజెక్ట్ సమయంలో ప్రేమగా మారిందని తెలుస్తోంది. అంతకుముందు సమంత, నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకొని విడిపోయారు. అటు రాజ్ నిడిమోరుకు కూడా 2015లో వివాహం కాగా, 2022లో విడిపోయినట్లు ప్రచారం జరిగింది.

ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


More Telugu News