ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి.. మా వాటికి అనుమతులివ్వండి: తెలంగాణ

  • పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి
  • పాలమూరు-రంగారెడ్డి తొలిదశకు అనుమతులు ఇవ్వాలని కోరిన ఉత్తమ్
  • ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
  • ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును నిలువరించాలని కేంద్రానికి వినతి
  • రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు కోరిన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా కేంద్ర జల సంఘం (CWC) సహా ఇతర సంస్థలను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు.

పాత పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకే పేరు మార్చి, డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఈ అంశంపై రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఒకవైపు ఏపీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే, తమ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరింది. మైనర్ ఇరిగేషన్ కింద ఆదా చేసిన 45 టీఎంసీల నీటితో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు భూసేకరణ చేపట్టడాన్ని నిలువరించాలని కోరింది. వీటితో పాటు సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌కు తుది అనుమతులు, ప్రాణహిత-చేవెళ్ల, సీతారామ, ముక్తేశ్వర్‌ వంటి పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కింద ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విన్నవించింది.


More Telugu News