శబరిమలలో అపశృతి... ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

  • ప్రమాదంలో 9 మందికి తీవ్రంగా గాయపడిన వైనం
  • క్షతగాత్రులు పంబలోని ఆసుపత్రికి తరలింపు
  • ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు 
  • భారీ వర్షం వల్లే ట్రాక్టర్ అదుపు తప్పిందంటున్న స్థానికులు
  • ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శబరిమల సన్నిధానంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం కొండ దిగుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులపైకి ఒక ట్రాక్టర్ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సన్నిధానం నుంచి కొండ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఏటవాలుగా ఉన్న రహదారిపై ట్రాక్టర్ అదుపు కోల్పోయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సన్నిధానం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో ఐదుగురు ఉన్నారని పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు.

తీవ్రంగా గాయపడిన భక్తులందరినీ వెంటనే పంబలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 


More Telugu News