హార్ట్ పేషెంట్లకే కాదు... స్ట్రోక్ పేషెంట్లకు కూడా 'స్టెంట్'!

  • పక్షవాతం చికిత్సలో సూపర్‌నోవా స్టెంట్ సురక్షితం, ప్రభావవంతం అని వెల్లడి
  • ఢిల్లీ ఎయిమ్స్ నేతృత్వంలో విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్
  • 'మేక్-ఇన్-ఇండియా'లో భాగంగా దేశీయంగా తయారైన వైద్య పరికరం
  • భారత్‌లో వినియోగానికి సీడీఎస్‌సీఓ ఆమోదం, తక్కువ ధరకే లభ్యం
సాధారణంగా హృద్రోగ బాధితులకు స్టెంట్ లు వేయడం తెలిసిందే. ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్లకు కూడా స్టెంట్ చికిత్సా ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. పక్షవాతం (స్ట్రోక్) బారినపడిన రోగుల చికిత్సలో 'సూపర్‌నోవా స్టెంట్' అనే అధునాతన వైద్య పరికరం సురక్షితమని, అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు శనివారం వెల్లడించారు. ఈ పరికరంపై నిర్వహించిన దేశపు మొట్టమొదటి క్లినికల్ ట్రయల్‌కు ఎయిమ్స్ నేతృత్వం వహించింది.

'గ్రాస్‌రూట్' పేరుతో ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించిన ఈ క్లినికల్ ట్రయల్‌కు ఎయిమ్స్ ఢిల్లీ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది. "ఈ ట్రయల్ భారత్‌లో స్ట్రోక్ చికిత్సలో ఒక కీలక మలుపు. తీవ్రమైన పక్షవాతం కేసుల్లో సూపర్‌నోవా స్టెంట్ అద్భుతమైన భద్రత, సామర్థ్యాన్ని చూపించింది" అని ఎయిమ్స్ న్యూరోఇమేజింగ్ విభాగాధిపతి, ట్రయల్ నేషనల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ శైలేష్ బి. గైక్వాడ్ తెలిపారు. ఈ అధ్యయన ప్రాథమిక ఫలితాలు 'జర్నల్ ఆఫ్ న్యూరోఇంటర్వెన్షనల్ సర్జరీ'లో ప్రచురితమయ్యాయి.

ఈ ట్రయల్‌లో భాగంగా, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే థ్రాంబెక్టమీ ప్రక్రియలో ఈ స్టెంట్ వాడగా.. మెదడులో రక్త ప్రవాహాన్ని విజయవంతంగా పునరుద్ధరించింది. మెదడులో రక్తస్రావం (3.1 శాతం), మరణాల రేటు (9.4 శాతం) చాలా తక్కువగా నమోదయ్యాయి. చికిత్స పొందిన వారిలో 50 శాతం మంది 90 రోజుల్లో సాధారణ జీవితానికి దగ్గరయ్యారు.

గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ 'మేక్-ఇన్-ఇండియా'లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ స్టెంట్‌ను ప్రత్యేకంగా భారతీయ రోగుల కోసం రూపొందించారు. గ్రాస్‌రూట్ ట్రయల్ డేటా ఆధారంగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇప్పటికే దీని వినియోగానికి ఆమోదం తెలిపింది. "ఇప్పటికే ఆగ్నేయాసియాలో 300 మంది రోగులకు ఈ పరికరంతో చికిత్స అందించాం. ఇప్పుడు ఇది భారత్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఏటా పక్షవాతం బారినపడుతున్న 17 లక్షల మంది భారతీయులకు ఇది కొత్త ఆశ కల్పిస్తుంది" అని మయామి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ యవగళ్ వివరించారు.


More Telugu News