హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

  • రాష్ట్రం కోసం ఆడటం గర్వంగా ఉందని చెప్పిన నితీశ్ కుమార్ రెడ్డి
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై హ్యాట్రిక్ ప్రదర్శన
  • టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన యువ ఆల్‌రౌండర్‌
  • పక్కా ప్రణాళికతోనే మూడు వికెట్లు పడగొట్టానని వెల్లడి
"ఏ జట్టు తరఫున ఆడినా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా నా రాష్ట్రం కోసం రాణించడం ఎప్పుడూ సంతోషంగా, గర్వంగా ఉంటుంది" అని టీమిండియా యువ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డి పేర్కొన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. సీనియర్ స్థాయి క్రికెట్‌లో ఇదే తన మొదటి హ్యాట్రిక్ అని, ఈ ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ దశలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ ఈ ఘనత సాధించాడు. అంబీలోని డీవై పాటిల్ అకాడమీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నితీశ్ వరుస బంతుల్లో హర్ష్ గవాలి, హర్‌ప్రీత్ భాటియా, రజత్ పాటిదార్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇది టీ20 ఫార్మాట్‌లో అతనికి అత్యుత్తమ ప్రదర్శన. అయితే, నితీశ్ అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓటమి చవిచూసింది.

కాగా, తాను సాధించిన హ్యాట్రిక్ వెనుక స్పష్టమైన ప్రణాళిక ఉందని నితీశ్ వివరించాడు. "ఆఫ్ స్టంప్ పై బంతిని వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మొదటి రెండు వికెట్లు అలాగే వచ్చాయి. మూడో బంతికి పదునైన స్క్రాంబుల్డ్ సీమ్ డెలివరీ వేయాలని నమ్మాను. అది లోపలికి దూసుకొచ్చి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. గతంలో రంజీ ట్రోఫీలో కూడా పాటిదార్‌ను ఇదే తరహాలో ఔట్ చేశాను" అని బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.


More Telugu News