రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్

  • పనితీరు చూపించకుండానే ఉన్నత పదవులు ఆశిస్తున్నారని భగవంత్ మాన్ ఎద్దేవా
  • ముందు పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • ప్రజాస్వామ్యంలో అధికారాన్ని సంపాదించుకోవాలి కానీ డిమాండ్ చేయకూడదని హితవు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో పనితీరు కనబరచకుండానే ఉన్నత పదవులు ఆశించడం వారిద్దరిలో ఉన్న ప్రధాన సమస్య అని ఆయన ఎద్దేవా చేశారు.

"నన్ను ప్రధానిని చేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని రాహుల్ గాంధీ చెబుతుంటారు. కానీ దేశ ప్రజలు మాత్రం.. ముందు మీరు ఏదైనా చేసి చూపించండి, ఆ తర్వాతే మిమ్మల్ని ప్రధానిని చేసే విషయం ఆలోచిస్తాం అంటున్నారు" అని మాన్ అన్నారు.

పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. "నన్ను ముఖ్యమంత్రిని చేయాలని సిద్ధూ పంజాబ్ ప్రజలను కోరుతున్నారు. కానీ, ముందు మీ పనితీరు చూపించండి, ఆ తర్వాత ఆలోచిస్తామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు" అని మాన్ తెలిపారు. అధికారాన్ని డిమాండ్ చేయడం కాదని, ప్రజాస్వామ్యంలో దాన్ని పనితీరుతో సంపాదించుకోవాలని హితవు పలికారు.

ఇటీవల నవజ్యోత్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్.. పంజాబ్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో భగవంత్ మాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌లో జవాబుదారీతనం, స్పష్టత లేవనడానికి ఇలాంటి బహిరంగ విమర్శలే నిదర్శనమని ఆయన పరోక్షంగా అన్నారు.


More Telugu News