బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి భారీ జ‌రిమానా

  • బేబీ పౌడర్ వాడకంతో ఇద్దరు మహిళలకు క్యాన్సర్
  • క్యాన్సర్ రిస్క్ గురించి హెచ్చరించలేదన్న న్యాయ‌స్థానం
  • జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.330 కోట్ల జరిమానా
  • కాలిఫోర్నియా జ్యూరీ సంచలన తీర్పు
ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు అమెరికా కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన బేబీ పౌడర్ వాడకం వల్ల తమకు ఒవేరియన్ క్యాన్సర్ వచ్చిందని ఇద్దరు మహిళలు దాఖలు చేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. క్యాన్సర్ ముప్పు గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని నిర్ధారించిన కాలిఫోర్నియా జ్యూరీ, బాధితులకు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.330 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పు ప్రకారం ఒక బాధితురాలికి 18 మిలియన్ డాలర్లు, మరో బాధితురాలికి 22 మిలియన్ డాలర్లు పరిహారంగా అందుతాయి. దశాబ్దాలుగా తాము జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను వాడుతున్నామని, దానిలో ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి తమకు తెలియదని బాధితులు తమ పిటిషన్‌లో ఆరోపించారు. వారి వాదనలతో ఏకీభవించిన జ్యూరీ ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ భద్రతకు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వేలాది కేసులు దాఖలు కాగా, పలు తీర్పులు కంపెనీకి వ్యతిరేకంగా వచ్చాయి. తాజా తీర్పుతో సంస్థకు మరోసారి చట్టపరంగా ఇబ్బందులు తప్పలేదు.


More Telugu News