అప్పుడు జగన్ చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారు: గుడివాడ అమర్నాథ్

  • విశాఖపై జగన్ చెప్పిన మాటలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్న గుడివాడ అమర్నాథ్
  • ప్రభుత్వ ప్రకటనల్లో లోకేశ్ ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణ
  • ప్రకటనల్లో మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలు చిన్నగా మారాయని ఎద్దేవా
విశాఖపట్నం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు వైసీపీ అధినేత జగన్ గతంలో చెప్పిన మాటలనే పోలి ఉన్నాయని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖను రాష్ట్రానికి ‘గ్రోత్ ఇంజన్’గా అభివర్ణించింది మొట్టమొదట జగన్ అని ఆయన గుర్తుచేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాధాన్యతను గుర్తించని చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు విశాఖకు రావడానికి జగన్ ప్రభుత్వ కృషే కారణమని అమర్నాథ్ తెలిపారు. పరిశ్రమల రాక అనేది నిరంతర ప్రక్రియ అని, దానిని తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆరోపించారు.

ప్రభుత్వ భూముల కేటాయింపుపైనా అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకే ఎందుకు కట్టబెడుతున్నారు? మీకు నచ్చిన వారికి రూపాయికే భూములు ఇస్తారా?" అని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఎకరా భూమిని లూలూ సంస్థ కోట్లకు కొనుగోలు చేస్తే, ఏపీలో మాత్రం అత్యంత చౌకగా ఇస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ప్రకటనల్లోనూ లోకేశ్ ను ప్రమోట్ చేయడానికే ప్రజాధనాన్ని వాడుతున్నారని విమర్శించారు. "ప్రకటనల్లో ప్రధాని మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు చుక్కల్లా మారాయి. పరిశ్రమల శాఖ మంత్రి ఫొటో కూడా పెట్టడం లేదు" అని దుయ్యబట్టారు. జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు విమర్శించిన మీడియా, ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.


More Telugu News