Ram Mohan Naidu: శ్రీకాకుళం వాసిగా ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu Elated Over GI Tag for Ponduru Khadi
  • పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక జీఐ ట్యాగ్ గుర్తింపు
  • శ్రీకాకుళం వారసత్వానికి లభించిన గౌరవమన్న కేంద్రమంత్రి
  • ఏళ్ల నిరీక్షణ, అవిశ్రాంత కృషి ఫలించిందని హర్షం
  • నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక భౌగోళిక సూచిక (జీఐ ట్యాగ్) లభించింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒక శ్రీకాకుళం వాసిగా గర్విస్తున్నానని పేర్నొన్నారు. 

"శ్రీకాకుళం వాసి గా నాకు ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అవిశ్రాంత కృషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత, పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మకమైన జీఐ ట్యాగ్ లభించడం నాకు ఎంతో అనందంగా ఉంది. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు... శ్రీకాకుళం చేనేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం. 

మన శ్రీకాకుళం గర్వం ఇప్పుడు నేడు దేశానికే గర్వకారణం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన, మహాత్మా గాంధీ గారికి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. 

ఎన్నో కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును నేసాయి. ఈ జీఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన మన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. ఈ జీఐ ట్యాగ్ వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పోందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది" అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Ram Mohan Naidu
Ponduru Khadi
Srikakulam
GI Tag
Khadi
Handloom Weavers
Textiles
Geographical Indication
Andhra Pradesh

More Telugu News