రేపు హైదరాబాదులో మెస్సీ ఈవెంట్... షెడ్యూల్ ఇదిగో!

  • హైదరాబాద్‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
  • 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా నగరంలో పర్యటన
  • సాయంత్రం 7:30 గంటల కల్లా స్టేడియానికి రాక
  • గంటపాటు మైదానంలో అభిమానుల మధ్య ఉండనున్న మెస్సీ
  • యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమం
ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి రానున్నాడు. 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా ఆయన హైదరాబాద్‌లో పర్యటించనుండటంతో అభిమానుల్లో అమితమైన ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఈవెంట్ ఆర్గనైజర్ అనుత్తమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

అనుత్తమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 5:30 గంటల నుంచే స్టేడియంలో సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మెస్సీ సాయంత్రం 7 నుంచి 7:30 గంటల మధ్యలో స్టేడియానికి చేరుకుంటాడు. సుమారు గంటపాటు మైదానంలో అభిమానుల మధ్య గడపనున్నాడు. "అభిమానుల కోసం చాలా వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మెస్సీ గంటపాటు మనతో ఇక్కడే ఉంటాడు" అని అనుత్తమ్ రెడ్డి వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా మెస్సీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడని ఆయన తెలిపారు. ముఖ్యంగా యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌ హోదాలో చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తాడని పేర్కొన్నారు. 

కాగా, మెస్సీ రాక సందర్భంగా భాగ్యనగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఫుట్‌బాల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News