Akhilesh Yadav: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం.. ప్రజలు తిరిగి కేసీఆర్‌కు పట్టం కడతారు: కేటీఆర్‌తో భేటీ అనంతరం అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav says KCR will regain power after KTR meeting
  • కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులే అన్న అఖిలేశ్ యాదవ్
  • ప్రజలు ఒకసారి స్వీకరిస్తారు.. మరోసారి పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారని వ్యాఖ్య
  • యూపీలో ఎస్పీలా మేం బౌన్స్ బ్యాక్ అవుతామన్న కేటీఆర్
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, పరిస్థితులు మారుతాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్‌కు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. హైదరాబాద్‌‌లోని నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటికి అఖిలేశ్ యాదవ్ వచ్చారు. కేటీఆర్‌, హరీశ్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.

అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులేనని, తాము ఎప్పటికీ వారితోనే ఉంటామని అన్నారు. కేటీఆర్ ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడతారని, సొంత మనిషిలా అనిపిస్తారని అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తాను కలుస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని, ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారని, మరోసారి మన విషయాలను పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారని ఆయన అన్నారు.

ఒకప్పుడు తాము తక్కువ సీట్లు గెలిచామని కానీ అదే ప్రజలు మళ్లీ తమ వెంట నిలిచారని ఆయన అన్నారు. అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉందని మనం ప్రజల వెంట నిలబడినప్పుడు ఏదో ఒక రోజు ప్రజలే మన పార్టీల వెంట నిలబడతారని, అండగా  ఉంటారని తెలిపారు.

తెలంగాణలోనూ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నామని అన్నారు. దేశం ప్రగతిశీల మార్గంలో వెళ్లే అవసరం ఉందని అన్నారు. దూరదృష్టితో ముందుకు వెళ్లాలని, విభజన రాజకీయాలు అంతం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌తోనూ మాట్లాడానని, త్వరలోనే వచ్చి ఆయనను కలుస్తానని అన్నారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ త్వరలోనే అఖిలేశ్ యాదవ్ కేసీఆర్‌తో సమావేశం అవుతారని అన్నారు. హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్ యాదవ్‌కు తాము స్వాగతం పలుకుతామని చెబితే, స్వయంగా వచ్చి కలుస్తానని, చర్చిస్తామని చెప్పారని తెలిపారు. కేసీఆర్ ఇంటికి వచ్చి తమతో సమయం గడిపి ఆతిథ్యం స్వీకరించారన్నారు. గతంలో శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్‌లో తక్కువ సీట్లు సాధించినా ప్రజల వెంబడి నిలబడినందుకు అఖిలేశ్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు.

అఖిలేశ్ పార్టీ స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారు.
Akhilesh Yadav
KTR
KCR
Telangana Politics
Samajwadi Party
BRS Party
Indian Politics

More Telugu News