9 జిల్లాలతో వీఈఆర్‌... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

  • గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్)
  • 2032 నాటికి 135 బిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
  • 7 గ్రోత్ డ్రైవర్లతో వీఈఆర్ అభివృద్ధికి ప్రణాళిక
  • 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ ధ్యేయం
  • అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా (గ్లోబల్ ఎకనమిక్ హబ్) తీర్చిదిద్దేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2032 నాటికి ఈ ప్రాంతాన్ని 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తద్వారా 30 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీఈఆర్ అభివృద్ధిపై శుక్రవారం విశాఖలో మంత్రులు, 9 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వీఈఆర్‌కు సంబంధించిన 49 ప్రాజెక్టులపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. 7 గ్రోత్ డ్రైవర్లు, 10 పాలసీలతో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు అమలు చేయాలని స్పష్టం చేశారు. "విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలి. భూసేకరణ ప్రక్రియ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో విశాఖ, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం" అని చంద్రబాబు అన్నారు. సమర్థంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే 2047 నాటికి వీఈఆర్ ఆర్థిక వ్యవస్థ 800 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు వంటి అన్ని రంగాల్లో వీఈఆర్ అభివృద్ధి చెందాలని సూచించారు. అనకాపల్లిలో త్వరలోనే మెడ్‌టెక్ జోన్-2 ఏర్పాటు చేస్తామని, టాయ్స్ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఐటీ, ఏఐ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరానికి మించి డేటా సెంటర్లను ప్రోత్సహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో అనుసంధానించాలని, రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని, రైతులు లాభసాటి పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించారు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు ఉన్న తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. వీఈఆర్ అభివృద్ధి పనులపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

9 జిల్లాలతో వీఈఆర్

విశాఖపట్నం-తూర్పు గోదావరి రీజియన్ (వీఈఆర్) సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 9 జిల్లాల పరిధిలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈ బ్లూప్రింట్ సిద్ధమైంది.

వీఈఆర్ స్వరూపం - గణాంకాలు

ప్రాంతం: మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. అవి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ.

ప్రస్తుత పరిస్థితి: ఈ ప్రాంతంలో 1.65 కోట్ల జనాభా నివసిస్తుండగా, 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. జీడీపీ 52 బిలియన్ డాలర్లు కాగా, తలసరి ఆదాయం 3,170 డాలర్లుగా ఉంది. ఇక్కడ 70 లక్షల మంది వర్క్‌ఫోర్స్ అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో వాటా: ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో వీఈఆర్ వాటా 31% కాగా, రాష్ట్ర జనాభాలో 23%, జీడీపీలో 30% వాటాను కలిగి ఉంది.

అభివృద్ధి ప్రణాళికలు

7 గ్రోత్ డ్రైవర్లు: గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, వ్యవసాయం, టూరిజం, హెల్త్ కేర్ హబ్, పక్కా ప్రణాళికతో పట్టణీకరణ-గృహ నిర్మాణం, అత్యుత్తమ మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పోర్టులు, రవాణా: మొత్తం 6 పోర్టులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులకు అదనంగా కాకినాడ గేట్ వే, మూలపేటలో కొత్త పోర్టులు రానున్నాయి. కొత్తగా 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులతో పాటు 77 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

పారిశ్రామిక, వ్యవసాయ రంగం: 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, ప్రపంచ స్థాయి నర్సరీ, ఫుడ్ పార్కులు, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

భవిష్యత్ అవసరాలు

వీఈఆర్ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ గదులు, 20 మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, 5,000 ఆసుపత్రి పడకలు అవసరమవుతాయి. అలాగే పరిశ్రమల కోసం 50 వేల ఎకరాలు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు అవసరమని అంచనా వేశారు.


More Telugu News