మరోసారి అన్నాహజారే నిరాహార దీక్ష

  • జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడి
  • లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం
  • ప్రజా సంక్షేమానికి లోకాయుక్త ఎంతో కీలకమన్న అన్నాహజారే
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (88) మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో జనవరి 30న ఈ నిరసనను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజా సంక్షేమానికి లోకాయుక్త ఎంతో ముఖ్యమైనదని, అయినప్పటికీ ప్రభుత్వం పదేపదే హామీలు ఇచ్చి విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా తాను నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను చేపట్టబోయే ఈ దీక్ష ఆఖరి నిరసన అవుతుందేమోనని కూడా ఆయన పేర్కొన్నారు.

లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2022లో అన్నాహజారే తన స్వగ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. లోకాయుక్తను అమలు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను విరమించారు. ఆ తర్వాత ఒక కమిటీ చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అయితే ఈ చట్టం ఇంకా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నాహజారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోకాయుక్త చట్టం అమలుపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తాను ఏడు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన విమర్శించారు. లోకాయుక్తను ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు చేయడం లేదో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.


More Telugu News