జడేజా మంచివాడు... జట్టులో కొందరు క్రికెటర్లు వ్యసనపరులు: రివాబా సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

  • కొందరు టీమిండియా క్రికెటర్లు వ్యసనపరులు అన్న జ‌డేజా అర్ధాంగి
  • త‌న‌ భర్త జడేజాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్న రివాబా
  • భర్తను పొగిడే క్రమంలో సహచర ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • రివాబా వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబా జడేజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ద్వారకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కొందరు క్రికెటర్లు వ్యసనపరులని, కానీ తన భర్త మాత్రం చాలా మంచివాడని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రివాబా మాట్లాడుతూ... "రవీంద్ర జడేజా క్రికెట్ కోసం లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతుంటాడు. అయినా అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఎందుకంటే అతనికి తన బాధ్యతలు తెలుసు. కానీ, జట్టులోని కొందరు సభ్యులకు దురలవాట్లు ఉన్నాయి. అయినా వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు" అని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా జడేజా దేశవిదేశాల్లో ఆడుతున్నాడని, బాధ్యత గల వ్యక్తిగా మెలుగుతాడని ఆమె తన భర్తను ప్రశంసించారు.

అయితే, భర్తను మెచ్చుకునే క్రమంలో ఇతర ఆటగాళ్లను కించపరిచేలా రివాబా మాట్లాడారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇతర జట్టు సభ్యులను చులకన చేసి మాట్లాడినట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రవీంద్ర జడేజా కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. మరోవైపు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను వీడి, వచ్చే సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు.


More Telugu News