Lady Don Aruna: నెల్లూరు 'లేడీ డాన్' అరుణపై పీడీ యాక్ట్.. కడప జైలుకు తరలింపు

Aruna Nellore Lady Don Booked Under PD Act Shifted to Kadapa Jail
  • గత ప్రభుత్వంలో పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు
  • ఎస్పీ ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ ఆమోదం
  • అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లపైనా చర్యలు
  • నెల్లూరు నుంచి కడప జైలుకు ముగ్గురి తరలింపు
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ‘లేడీ డాన్’ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి, ముగ్గురినీ నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ గత ప్రభుత్వ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకు పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు.

అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్. జయప్రకాశ్‌, షేక్‌ షాహుల్‌ హమీద్‌లపైనా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
Lady Don Aruna
Aruna Nellore
Nellore Crime
PD Act
Ajitha Vejendla
Himanshu Shukla
Kadapa Jail
Andhra Pradesh Crime
Kovuru
Rowdy Sheeter

More Telugu News