Ashwini Vaishnaw: సామాన్యులకు తత్కాల్ టిక్కెట్లు అందేలా రిజర్వేషన్ వ్యవస్థను తీర్చిదిద్దాం: అశ్వినీ వైష్ణవ్

Ashwini Vaishnaw Streamlined Tatkal Ticket System for Common People
  • ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెచ్చామని వెల్లడి
  • 322 రైళ్లకు ఓటీపీ వర్తింప జేశామన్న అశ్వినీ వైష్ణవ్
  • 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడి
సామాన్యులకు సాధారణ, తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఉండేలా రిజర్వేషన్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తత్కాల్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన ఒక ప్రశ్నకు గురువారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

తత్కాల్ టిక్కెట్ల జారీ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతను కూడా చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించారు. ఆకామయ్ (AKAMAI) వంటి యాంటీ బాట్ టెక్నాలజీని వినియోగించి నకిలీ, ఆటోమేటెడ్ ప్రయత్నాలను అడ్డుకున్నామని అన్నారు.

ప్రస్తుతం 322 రైళ్లకు ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను వర్తింపజేశామని ఆయన అన్నారు. దీని ద్వారా ఆయా రైళ్లలో తత్కాల్ టిక్కెట్ల అందుబాటు సమయం దాదాపు 65 శాతం మేర పెరిగిందని తెలిపారు. అలాగే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ బుకింగ్స్‌కు ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని డిసెంబర్ 4 వరకు 211 రైళ్లకు వర్తింపజేసినట్లు తెలిపారు. దీనివల్ల 96 పాపులర్ రైళ్ల టిక్కెట్ల అందుబాటు సమయం 95 శాతం మేర పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Ashwini Vaishnaw
Tatkal tickets
Indian Railways
IRCTC
Aadhar OTP

More Telugu News