Chandrababu Naidu: అప్పుడు ఎర్రటి ఎండ... ఇప్పుడు ఏసీ!: టీడీపీ నేతలతో చంద్రబాబు 'కాఫీ కబుర్లు'

Chandrababu Naidu Coffee Talk with TDP Leaders
  • పాత రోజుల్లో శిక్షణను గుర్తు చేసుకున్న అధినేత
  • ప్రతి పోలింగ్ బూత్ బలోపేతంపై దృష్టి పెట్టాలని పిలుపు
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచన
  • క్రమశిక్షణతో పనిచేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశం
తెలుగుదేశం పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘కాఫీ కబుర్లు’ పేరిట నిర్వహించిన వినూత్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ముఖాముఖిగా సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. వారితో కలిసి కాఫీ ఆస్వాదించారు. పార్టీలో ఇటీవల నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పాత రోజులను గుర్తు చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాంలో తాము పడిన కష్టాలను నేతలతో పంచుకున్నారు. "నాడు చెట్ల కింద, ఎర్రటి ఎండలోనూ శిక్షణా కార్యక్రమాలు చేపట్టేవాళ్లం. ఎన్నో ఇబ్బందులున్నా పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డాం. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు చల్లటి ఏసీ గదుల్లో శిక్షణ ఇస్తున్నాం. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవాలి. పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవడం అత్యవసరం" అని ఆయన సూచించారు.

నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, "ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో అక్కడ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి. బలహీనమైన నియోజకవర్గానికి మంచి నేతను ఇస్తే, ఆ నియోజకవర్గాన్ని సైతం బలపరుస్తారు. అదే బలమైన నియోజకవర్గాన్ని బలహీన నేత చేతిలో పెడితే పార్టీని నిర్వీర్యం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. "అన్నదాత సుఖీభవ, దీపం-2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తున్నాం. వీటి ద్వారా మహిళల ఓటు బ్యాంకు మెజారిటీ మనకే వచ్చేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదే" అని అన్నారు.

గత ఐదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూ, "2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ సరిచేసి గాడిన పెడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పట్టుదలతో పనిచేశారో, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతకుమించిన స్థాయిలో పనిచేయాలి. ఏడాదికి రూ.33 వేల కోట్లు కేవలం పింఛన్లకే ఇస్తున్నాం. కొందరు డబ్బుతోనే ఎన్నికలను గెలవగలమని భావిస్తారు, కానీ అది భ్రమ మాత్రమే. మనం చేసే మంచి పనులను ప్రజలకు నిత్యం వివరిస్తేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది. పని చేయడం ఒక ఎత్తు అయితే, చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు" అని చంద్రబాబు ఉద్బోధించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో బలాబలాలు చూసుకుని, పార్టీని పటిష్టం చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Coffee Kaburlu
Andhra Pradesh Politics
AP Elections
NTR
Government Schemes
Political Strategy
Party Cadre

More Telugu News