ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదని తెలిశాక గదిలోనే ఉంటూ బోర్‌గా ఫీలయ్యేవాడిని: అర్ష్ దీప్ సింగ్

  • ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదన్న అర్ష్ దీప్
  • ఆ సమయంలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు వెల్లడి
  • ఛానల్‌ను ప్రారంభించడం తనకు వరంగా మారిందన్న అర్ష్ దీప్
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో తనకు ఆడే అవకాశం లభించలేదని తెలిసిన తర్వాత తన గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యేవాడినని, ఆ సమయంలోనే యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించానని టీమిండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వెల్లడించాడు. అర్ష్‌ దీప్ తన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాడు.

ఇటీవల విరాట్ కోహ్లీతో కలిసి చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్‌ అయింది. అలాగే, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి రీల్ చేయాలంటే అతను మరిన్ని వికెట్లు తీయాలని సరదాగా వ్యాఖ్యానించడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది.

తాజాగా జియో హాట్ స్టార్‌తో మాట్లాడుతూ, తాను యూట్యూబ్ ఛానల్‌ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో వివరించాడు. గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యే సమయంలో ఈ ఛానల్‌ను ప్రారంభించినట్లు తెలిపాడు. ఛానల్‌ ప్రారంభించడం తనకు వరంగా మారిందని ఆయన పేర్కొన్నాడు.

తాను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఈ స్థాయిలో ఆడుతున్నందుకు కృతజ్ఞతతో ఉండాలని, కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుందని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవాలని వ్యాఖ్యానించాడు.

విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత అర్ష్ దీప్ సింగ్, విరాట్ కోహ్లీతో కలిసి ఒక రీల్ చేశాడు. దానికి ఒక్కరోజు వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్ వచ్చాయి.


More Telugu News