Pemmasani Chandra Sekhar: అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

Pemmasani Chandra Sekhar Amaravati to get permanent status bill in Parliament
  • ఈ పర్యాయం లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అని వెల్లడి
  • సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అవుతోందన్న పెమ్మసాని
  • అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.

రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల వల్లే బిల్లు ఆలస్యమవుతోందని పెమ్మసాని వివరించారు. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అమరావతి బిల్లుపై వైసీపీ అధినేత జగన్ విషం కక్కుతున్నారని, ఆయనను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పాలన చేతకాకపోవడం వల్లే 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు.

అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వేలాది మంది నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. త్వరలోనే హడ్కో, కాగ్, పోస్టల్ భవనం, కేంద్రీయ విద్యాలయాలు వంటివి అమరావతిలో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు. 
Pemmasani Chandra Sekhar
Amaravati
Andhra Pradesh
AP Capital
Central Government
Chandrababu Naidu
Jagan Mohan Reddy
AP Politics
Parliament Bill

More Telugu News