Pawan Kalyan: ఆయన 'భారతరత్న'కు నిజంగా అర్హుడు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Says Subramanya Bharathi Deserves Bharat Ratna
  • తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి భారతరత్న ఇవ్వాలని కోరిన పవన్ కళ్యాణ్
  • భారతి జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నివాళి
  • ఆయన జీవితం నుంచి మూడు ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానన్న పవన్
ప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గురువారం సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ఓ పోస్ట్ పెట్టారు. సుబ్రహ్మణ్య భారతి భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని పవన్ పేర్కొన్నారు.

చెన్నైలో పెరిగిన తాను, సుబ్రహ్మణ్య భారతి జీవితం నుంచి మూడు ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. "1) మాతృభూమి పట్ల నిర్భయమైన నిబద్ధత, 2) మాతృభాషపై ప్రేమ, 3) బహుభాషా నైపుణ్యాలు, ఇతర భాషల పట్ల గౌరవం.. ఈ మూడు విషయాలు ఆయన నుంచి నేర్చుకోవాలి. ఆయన నిజంగా భారతరత్నకు అర్హుడు" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి 'దేఖ్లేంగే సాలా' అనే ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే అంచనాలను పెంచేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను విశాల్ దద్లానీ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పూర్తి పాటను డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ కోసం సమయం కేటాయించడం పట్ల గతంలో చిత్రబృందం ప్రశంసలు కురిపించింది.
Pawan Kalyan
Subramanya Bharathi
Bharat Ratna
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Janasena
Vishal Dadlani

More Telugu News