YS Sharmila: ఆ భారాన్ని కూటమి ప్రభుత్వమే భరించాలి: షర్మిల

YS Sharmila Slams Andhra Pradesh Government Over Electricity Charges
  • కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు
  • విద్యుత్ ఛార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ సిద్ధమవుతోందని ఆరోపణ
  • ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వమే విద్యుత్ భారాన్ని భరించాలని డిమాండ్
  • గతంలో విధించిన సర్దుబాటు ఛార్జీలను కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. "చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు" అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేస్తోందంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సుమారు రూ.15,651 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన కూడా జారీ చేసిందని షర్మిల గుర్తుచేశారు. ఇంత జరుగుతున్నా, ప్రజలపై భారం పడదని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పదేపదే చెప్పడం పాత చింతకాయ పచ్చడిలా ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15 వేల కోట్లను ప్రజల నుంచి ట్రూ-అప్ బిల్లుల రూపంలో వసూలు చేసి వారి జేబులకు చిల్లులు పెట్టారని ఆరోపించారు.

ఇప్పుడు మరోసారి 'టైమ్ ఆఫ్ ది డే' పేరుతో ఇంకో రూ.15 వేల కోట్లను దోచుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని షర్మిల ఆరోపించారు. నమ్మి ఓటేసినందుకు ఏడాదికోసారి ప్రజలకు ఇలా 'హైటెన్షన్ షాక్' ఇస్తున్నారని, ఆర్థిక లోటు పేరుతో ప్రజల నడ్డి విరవడం దారుణమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రికి కొన్ని డిమాండ్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. "మీకు నిజంగా ఛార్జీలు పెంచకూడదనే చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మీద నిలబడాలనుకుంటే, ఏపీఈఆర్‌సీ ప్రతిపాదనలపై తక్షణం స్పందించండి. ప్రతిపాదిత రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అధికారికంగా ప్రకటించండి. అలాగే, ఇప్పటివరకు ప్రజలపై మోపిన రూ.15 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను కూడా వెంటనే రద్దు చేయాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila
Andhra Pradesh
AP Congress
Electricity charges
Chandrababu Naidu
APERC
Power tariffs
Political criticism
Government policies
Public burden

More Telugu News