Pinnelli Ramakrishna Reddy: జంట హత్యల కేసు.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers Surrenders in Macherla Court in Twin Murder Case
  • గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న అన్నదమ్ములు
  • నేటితో ముగిసిన సుప్రీంకోర్టు విధించిన రెండు వారాల గడువు 
  • ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గురువారం ఉదయం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో వారు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

ఈ ఏడాది మే 24న గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే అన్నదమ్ములను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి బైక్‌ను కారుతో ఢీకొట్టి, కిందపడ్డాక బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఏ7గా పేర్కొన్నారు.

ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు పిన్నెల్లి సోదరులు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, లొంగిపోయేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని వారి తరఫు న్యాయవాది కోరడంతో సర్వోన్నత న్యాయస్థానం గడువు మంజూరు చేసింది. ఈ గడువు ఇవాళ్టితో ముగియడంతో పిన్నెల్లి సోదరులు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో లొంగిపోయారు.
Pinnelli Ramakrishna Reddy
Macherla
Gundlapadu twin murders case
Pinnelli Venkata Rami Reddy
Palnadu district
Veludurthi
Supreme Court
Andhra Pradesh politics
court surrender

More Telugu News