Paka Suresh: కడప నూతన మేయర్‌గా పాక సురేశ్ ఏకగ్రీవ ఎన్నిక

Paka Suresh Elected as Kadapa New Mayor
  • అవినీతి ఆరోపణలతో గత మేయర్‌పై వేటు పడటంతో అనివార్యమైన ఎన్నిక
  • మూడు నెలల పదవీకాలం కావడంతో పోటీకి దూరంగా టీడీపీ
  • ముద్దనూరు ఎంపీపీగా వెన్నపూస పుష్పాలత ఎన్నిక
కడప నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాక సురేశ్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. గత మేయర్ సురేశ్ బాబుపై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కూటమి ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది.

అయితే, మేయర్ పదవి కోసం వైసీపీలోనే ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని పాక సురేశ్ పేరును ఖరారు చేశారు. డిప్యూటీ మేయర్లు నిత్యానంద రెడ్డి, షఫీలు సురేశ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కేవలం మూడు నెలల పదవీకాలమే మిగిలి ఉండటంతో టీడీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉంది.

ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్లందరి ఏకాభిప్రాయంతోనే అభ్యర్థిని ఎంపిక చేశామని, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ముద్దనూరు ఎంపీపీగా వైసీపీకి చెందిన వెన్నపూస పుష్పాలత కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సైతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు దూరంగా ఉన్నాయి.
Paka Suresh
Kadapa Mayor
Kadapa Municipal Corporation
YS Jagan Mohan Reddy
Avinash Reddy
Ravindranath Reddy
Andhra Pradesh Politics
YSRCP
Municipal Elections
Venna Pusa Pushpalatha

More Telugu News