Donald Trump: నడి సముద్రంలో వెనెజువెలా ట్యాంకర్ సీజ్.. వీడియో ఇదిగో!

Venezuela Oil Tanker Seized by US Navy Under Trump Order
  • హెలికాప్టర్ లో వెళ్లి ఆయిల్ షిప్ పై దిగిన అమెరికా సైనికులు
  • వెనెజువెలా నుంచి క్యూబాకు వెళుతున్న షిప్
  • కరీబియన్ దీవుల్లో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు
వెనెజువెలా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పదవి నుంచి దిగిపోవాలని వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మధురోను ఇప్పటికే హెచ్చరించిన ట్రంప్.. ఇటీవల కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించారు. డ్రగ్ స్మగ్లర్లకు వంత పాడుతున్నారని మధురోపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పలు డ్రగ్ స్మగ్లింగ్ బోట్లను అమెరికా సైన్యం సముద్రంలోనే పేల్చివేసింది. ఈ క్రమంలో తాజాగా వెనెజువెలా ఆయిల్ ట్యాంకర్ షిప్ ను అమెరికా సైన్యం సీజ్ చేసింది.

వెనెజువెలా తీరం నుంచి క్యూబాకు బయలుదేరిన ఈ భారీ షిప్ ను అమెరికా సైనికులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలికాప్టర్ లో వెళ్లి షిప్ పై దిగిన సైనికులు.. ఆయుధాలతో షిప్ సిబ్బందిని చుట్టుముట్టిన వీడియోను అమెరికా మీడియాకు విడుదల చేసింది. ఈ విషయంపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ అని చెప్పారు. ఇకముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, మీరు చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వెనెజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడోపై ఆ దేశ అధ్యక్షుడు మధురో విధించిన ఆంక్షలను మీడియా ట్రంప్ వద్ద ప్రస్తావించింది. ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ బహుమతి ప్రదానోత్సవానికి మచాడో హాజరైతే ఆమెను అరెస్టు చేస్తామని మధురో హెచ్చరించారు. దీంతో ఆమె బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. మచాడో తరఫున ఆమె కూతురు నోబెల్ బహుమతి అందుకున్నారు. అయితే, మచాడో నార్వేకు వెళ్లారని సమాచారం. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మచాడో అరెస్టవుతారని తాను భావించడం లేదని, ఆమె అరెస్టు కావడం తనకు నచ్చదని వ్యాఖ్యానించారు.
Donald Trump
Venezuela
oil tanker
Nicolas Maduro
US Navy
Cuba
drug smuggling
Maria Corina Machado
Nobel Peace Prize

More Telugu News