Hyderabad Aquarium: హైదరాబాద్‌లో రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

Kotwalguda Hyderabad to Build 300 Crore Tunnel Aquarium
  • కొత్వాల్‌గూడలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు
  • దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా గుర్తింపు
  • వచ్చే ఏడాది నాటికి సందర్శకులకు అందుబాటులోకి
  • 300 రకాల జీవులతో పాటు అండర్ వాటర్ రెస్టారెంట్ ఏర్పాటు
హైదరాబాద్ నగరానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో రూ. 300 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు, పూర్తయితే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది.

మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పొలిన్ అక్వేరియమ్స్, కాడోల్ గ్రూప్ కన్సార్టియం కలిసి ఈ అక్వేరియంను నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి, ఇతర అనుమతులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చనుంది. టెక్నికల్ భాగస్వామిగా పొలిన్ అక్వేరియమ్స్ వ్యవహరించనుండగా, మల్టీవర్స్ హోటల్స్, కాడోల్ గ్రూప్ సంస్థలు ఆతిథ్య, మౌలిక వసతుల విభాగాలను పర్యవేక్షించనున్నాయి.

సుమారు 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ సంప్రదాయం ఉట్టిపడేలా దీనిని నిర్మించనున్నట్టు పొలిన్ అక్వేరియమ్స్ తెలిపింది. ఇందులో 100 మీటర్ల పొడవైన టన్నెల్‌తో పాటు 30 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ట్యాంకులు ఉంటాయి. ఒకేసారి 3 వేల మంది సందర్శించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

ఈ అక్వేరియంలో 300 జాతులకు చెందిన సుమారు 10 వేల జలచరాలను ప్రదర్శనకు ఉంచుతారు. దీంతో పాటు అండర్ వాటర్ రెస్టారెంట్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ టన్నెల్ అక్వేరియం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
Hyderabad Aquarium
Kotwalguda
Tunnel Aquarium
Public Aquarium
Multiverse Hotels Private Limited
Polin Aquariums
Kadool Group
Telangana
Aquatic Life
Underwater Restaurant

More Telugu News