Solar cycle track: దేశంలోనే ప్రతిష్ఠాత్మక సైకిల్ ట్రాక్ పై దశదిన కర్మ.. పోలీస్ కేసు.. వీడియో ఇదిగో!

Hyderabad solar cycle track used for death rituals creates controversy
  • అడ్డుకున్న సైకిలిస్టును బెదిరించిన ఫ్యామిలి
  • సీఎం తెలుసు, నేను సర్పంచ్ నంటూ బెదిరింపులు
  • అత్యాధునిక నిర్మాణాలకు మనోళ్లకు అర్హత లేదంటూ నెటిజన్ల మండిపాటు
గచ్చిబౌలిలో ప్రభుత్వం నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలోనే మొట్టమొదటిది.. ప్రపంచంలోనే రెండో సైకిల్ ట్రాక్.. సైకిలిస్టుల కోసం నిర్మించిన ఇంత విశిష్టమైన ట్రాక్ పై ఓ కుటుంబం దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించింది. క్షుర కర్మలతో పాటు వాటర్ ట్యాంక్ తెప్పించుకుని మరీ స్నానాలు చేశారు. ఇదంతా గమనించిన ఓ సైకిలిస్టు వారిని అడ్డుకోగా.. తాను స్థానిక గ్రామ సర్పంచ్ నని, తనకు సీఎం తెలుసని బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆ సైకిలిస్టు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఈ వ్యవహారం మొత్తాన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యాధునిక నిర్మాణాలను అనుభవించే అర్హత మనకు లేదంటూ ఆ వీడియోలో వాపోయారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన సైకిల్ ట్రాక్ ను ఇలా కర్మకాండల కార్యక్రమానికి వినియోగించుకోవడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఆ ఫ్యామిలీకి సంతాపం తెలుపుతూనే సైకిల్ ట్రాక్ పై దశదిన కర్మ నిర్వహించడాన్ని తప్పుబడుతున్నారు. ఆ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు శ్మశానాలు, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయని గుర్తుచేశారు. అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఇలా ప్రపంచ స్థాయి నిర్మాణాలపై చేయడం సరికాదని అంటున్నారు.

మోకిలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాగూడ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ చిన్నాన్న కోట వెంకటయ్య గౌడ్ గతవారం మృతి చెందాడు. తాజాగా ఆయన దశదినకర్మ కార్యక్రమాలను ఇంద్రనగర్ సమీపంలోని సైకిల్ ట్రాక్ పై నిర్వహించారు. సైకిలిస్టుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. సైకిల్ ట్రాక్ పై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Solar cycle track
Hyderabad
Gachibowli
Dasa dina karma
Cycle track controversy
Telangana
Mokila Police
Kota Venkataiah Goud
Mirjaguda

More Telugu News