Donald Trump: భారత్‌ను కోల్పోయిన అధ్యక్షుడిగా ట్రంప్ మిగిలిపోతారు: డెమొక్రాట్ల హెచ్చరిక

Donald Trump to be known as President who lost India
  • భారత్‌పై ట్రంప్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన డెమొక్రాట్లు
  • టారిఫ్‌ల వల్ల అమెరికా-భారత్ బంధం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన
  • చైనా కన్నా భారత్‌పైనే ప్రస్తుతం అధిక టారిఫ్‌లు ఉన్నాయని విమర్శ
  • హెచ్-1బీ వీసాలపై భారీ ఫీజులతో భారతీయులను లక్ష్యం చేసుకున్నారని ఆరోపణ
  • వ్యూహాత్మక భాగస్వామిని ప్రత్యర్థుల వైపు నెట్టొద్దని ప్రభుత్వానికి సూచన
భారత్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి, టారిఫ్‌ల విధానంపై అమెరికా కాంగ్రెస్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ట్రంప్ దూకుడు కారణంగా అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌తో సంబంధాలు దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉందని డెమొక్రాట్లు హెచ్చరించారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై జరిగిన కాంగ్రెస్ కమిటీ విచారణలో డెమొక్రటిక్ సభ్యురాలు సిడ్నీ కామ్లాగర్-డోవ్ ట్రంప్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

గత బైడెన్ ప్రభుత్వం ఎంతో పటిష్ఠంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ చేతిలో పెట్టిందని, దశాబ్దాలుగా ఇరు పార్టీలు నిర్మించిన బంధాన్ని ఆయన నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. "ట్రంప్ తన వైఖరి మార్చుకోకపోతే, భారత్‌ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కీలక భాగస్వాములను మన ప్రత్యర్థుల వైపు నెట్టడం ద్వారా నోబెల్ శాంతి బహుమతి రాదు" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం విధించిన 25 శాతం ‘లిబరేషన్ డే టారిఫ్‌లు’, ఆ తర్వాత భారత్ దిగుమతి చేసుకునే రష్యా చమురుపై మరో 25 శాతం సుంకం విధించడంతో మొత్తం టారిఫ్‌ల భారం 50 శాతానికి చేరిందని సిడ్నీ గుర్తుచేశారు. "ప్రస్తుతం చైనాపై ఉన్న టారిఫ్‌ల కన్నా భారత్‌పై ఉన్న టారిఫ్‌లే ఎక్కువ. ఇది మనకు మనమే నష్టం చేసుకునే విధానం" అని ఆమె విమర్శించారు. వీటితో పాటు 70 శాతం మంది భారతీయులు వినియోగించుకునే హెచ్-1బీ వీసాలపై 100,000 డాలర్ల ఫీజు విధించడం కూడా అమెరికాకు భారతీయులు అందిస్తున్న సేవలను అవమానించడమేనని అన్నారు.

ఈ విచారణలో ఓఆర్ఎఫ్ అమెరికాకు చెందిన ధ్రువ జైశంకర్ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌లో రాజకీయ సంకల్పం ఉంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి పరిష్కారం అందుబాటులోనే ఉందని తెలిపారు. చైనాను ఎదుర్కోవడం, సరఫరా గొలుసులను స్థిరీకరించడం వంటి కీలక వ్యూహాత్మక అంశాలను ఈ టారిఫ్‌ల వివాదం పక్కదారి పట్టిస్తోందని నిపుణులు హెచ్చరించారు. అమెరికాకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ఈ భాగస్వామ్యాన్ని వదులుకోవడం చారిత్రక తప్పిదం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
Donald Trump
India US relations
US India trade
Tariffs
Sydney Kamlager Dove
H-1B Visa
Dhruva Jaishankar
US foreign policy
Democratic party
India Russia oil

More Telugu News