Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ అంశాలపై చర్చ

Chandrababu Naidu AP Cabinet Meeting Focuses on Amaravati Investments
  • అమరావతి నిర్మాణం కోసం రూ.7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలపనున్న కేబినెట్ 
  • రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
  • లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణాలకు పరిపాలన అనుమతులు
  • వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి మండలి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా, అమరావతి నిర్మాణ పనుల కోసం నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు అనుమతిని ఇవ్వనున్నారు.
 
అలాగే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఏస్ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలోకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సుమారు 56 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
 
ఇక ఇతర ముఖ్యమైన అజెండా అంశాల్లో భాగంగా, రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు, రూ.163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలపనున్నారు. 2024 - 25 వార్షిక నివేదికలను కూడా మంత్రిమండలి ఆమోదించనుంది.
 
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
Amaravati Construction
Investments AP
CRDA
NABARD Loan
AP SIPB
Job Creation
Lok Bhavan

More Telugu News