Damodar Prasad: అఖండ-2 రిలీజ్ తో చిన్న సినిమా బేజారు... నిర్మాత దామోదర్ ప్రసాద్ ఏమన్నారంటే...!

Damodar Prasad on Akhanda 2 release impact on small films
  • అఖండ 2' రాకతో వాయిదా పడుతున్న చిన్న చిత్రాలు
  • పరిశ్రమ అసంఘటిత రంగం అని నిర్మాత దామోదర్ ప్రసాద్ వ్యాఖ్య
  • డిసెంబరు 25కు వాయిదా పడిన 'ఈషా' మూవీ
  • పలు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం 'అఖండ 2' విడుదల ప్రభావం టాలీవుడ్‌లోని చిన్న చిత్రాలపై గట్టిగా పడింది. డిసెంబరు 12న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో, అదే తేదీకి విడుదల కావాల్సిన పలు చిన్న సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఈ పరిణామంపై నిర్మాతలు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, బన్నీ వాసు స్పందించారు.

'ఈషా' సినిమా ప్రెస్‌మీట్‌లో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అఖండ 2' రాకతో చిన్న చిత్రాలపై ప్రభావం పడిన మాట వాస్తవమేనని అన్నారు. పెద్ద, చిన్న సినిమా ఏదైనా వ్యాపారమేనని, కానీ పెద్ద సినిమా వస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. చిత్ర పరిశ్రమ ఒక అసంఘటిత రంగమని, ఫిల్మ్ ఛాంబర్‌లో ఎన్నిసార్లు చర్చించినా పరిస్థితి మారదన్నారు. అందుకే చిన్న నిర్మాతలు ఎప్పుడూ తమ సేఫ్టీ చూసుకుంటారని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి హోదాలో ఆయన వ్యాఖ్యానించారు.

మరో నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ.. మనం కారులో వెళ్తుంటే వెనుక నుంచి లారీ హారన్ కొడితే పక్కకు తప్పుకుంటామని, సినిమాల విషయంలోనూ అంతేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'అఖండ 2' కారణంగా డిసెంబరు 12న విడుదల కావాల్సిన 'ఈషా' చిత్రాన్ని డిసెంబరు 25కు వాయిదా వేశారు. అలాగే 'మోగ్లీ' సినిమాను 13కు, 'సుకుటుంబానాం' 19కి, 'సైక్ సిద్ధార్థ్'ను 2026 జనవరి 1కి మార్చారు. వీటితో పాటు 'ఘంటసాల', 'నా తెలుగోడు', 'మిస్టీరియస్' వంటి మరికొన్ని చిత్రాల కొత్త విడుదల తేదీలను ప్రకటించాల్సి ఉంది. 
Damodar Prasad
Akhanda 2
Tollywood
Telugu cinema
Bunny Vasu
small budget films
Eesha movie
film release dates
movie industry
film chamber

More Telugu News