సెక్యూరిటీ గార్డుకు యూట్యూబ్‌లో 3 లక్షల సబ్‌స్క్రయిబర్లు... ఆశ్చర్యపోయిన పారిశ్రామికవేత్త

  • శాన్ ఫ్రాన్సిస్కోలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యువకుడు
  • యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు
  • బెంగాలీ కామెడీ స్కిట్లతో ఆకట్టుకుంటున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన పారిశ్రామికవేత్త పోస్ట్
  • యూట్యూబ్ ఆదాయంపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ
శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారత సంతతి పారిశ్రామికవేత్త హరీశ్ ఉతయకుమార్ తన కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ యువకుడు కేవలం సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదని, యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్న ఒక కంటెంట్ క్రియేటర్ అని గుర్తించారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పంచుకోగా, ఈ పోస్ట్ వేగంగా వైరల్ అయింది.

హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యువకుడు కరోనా మహమ్మారి సమయంలో, తన 14 ఏళ్ల వయసులో యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టాడు. బెంగాలీ భాషలో కామెడీ స్కిట్లు చేస్తూ ఆన్‌లైన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సృజనాత్మకతను, పట్టుదలను మెచ్చుకున్న హరీశ్.. భవిష్యత్తులో తాను బెంగాలీ ప్రకటనలు చేయాల్సి వస్తే తప్పకుండా అతనికి అవకాశం ఇస్తానని, ఇతరులు కూడా అతన్ని ప్రోత్సహించాలని కోరారు.

అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలామంది ఆ యువకుడి ప్రతిభను ప్రశంసించగా, మరికొందరు డిజిటల్ ప్రపంచంలోని వాస్తవాల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. "అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌గా ఎందుకు పనిచేస్తున్నాడు? సబ్‌స్క్రయిబర్ల సంఖ్య కాదు, కంటెంట్ నాణ్యతే ముఖ్యం" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు, గార్డ్ యూట్యూబ్ ఛానెల్ లింక్‌ను హరీశ్ ఎందుకు షేర్ చేయలేదని కొందరు ప్రశ్నించారు.

ఈ సంఘటన యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై డబ్బు సంపాదించడం అంత సులువు కాదనే చర్చకు దారితీసింది. లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని చెప్పలేమని, ప్రేక్షకుల ఆదరణ, కంటెంట్ రకం, ప్రకటనకర్తల ఆసక్తి వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News