IndiGo: ఇండిగోపై డీజీసీఏ ప్రత్యేక నిఘా... పర్యవేక్షణకు 8 మందితో బృందం

IndiGo Under DGCA Scrutiny Special Team Monitoring IndiGo
  • తీవ్ర సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం
  • సంస్థ విమాన సర్వీసులపై 10 శాతం కోత విధించిన కేంద్రం
  • డిసెంబర్ 9 నుంచే కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయన్న ఇండిగో సీఈఓ
  • కొత్త నిబంధనలతో పైలట్ల కొరతే సంక్షోభానికి కారణం
విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టి సారించింది. సంస్థ కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించేందుకు 8 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని బుధవారం ఏర్పాటు చేసింది. ఈ బృందంలోని ఇద్దరు అధికారులు ఇండిగో కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ రోజువారీ ప్రక్రియలను పరిశీలించి, లోపాలను గుర్తిస్తారని డీజీసీఏ తెలిపింది.

కొత్త విమాన డ్యూటీ నిబంధనల కారణంగా తీవ్రమైన పైలట్ల కొరత ఏర్పడటంతో ఇండిగో గత కొద్ది రోజులుగా వేలాది విమానాలను రద్దు చేయడం, ఆలస్యంగా నడపడం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఇండిగో నడపగల విమానాల సంఖ్యపై 10 శాతం కోత విధించింది.

ఈ పరిణామాలను అసాధారణ పరిస్థితులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. డిసెంబర్ 3 నుంచే పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులను కీలక విమానాశ్రయాలకు పంపినట్లు ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.

మరోవైపు, ఇండిగో కార్యకలాపాలు డిసెంబర్ 9 నాటికే పూర్తిగా కుదుటపడ్డాయని సీఈఓ పీటర్ ఎల్బర్స్ నిన్న ప్రకటించారు. సంస్థ తిరిగి గాడిన పడిందని, ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు రోజుకు 1,800కు పైగా విమానాలను నడుపుతున్నామని చెప్పారు. ఈ సమస్యకు దారితీసిన కారణాలపై అంతర్గత సమీక్ష ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
IndiGo
IndiGo flights
DGCA
flight cancellations
pilot shortage
Ram Mohan Naidu
Peter Elbers
aviation
flight delays
civil aviation

More Telugu News