Chandrababu Naidu: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్... సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం

Chandrababu Naidu Announces Agriculture Equipment Bank for Farmers
  • సాగు వ్యయం తగ్గించేలా అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంకుల ఏర్పాటు
  • పత్తి కొనుగోళ్లలో సీసీఐ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం
  • ధరలు పడకుండా హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానం
  • ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగుకు ప్రోత్సాహం
  • ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం
రాష్ట్రంలో రైతులపై సాగు వ్యయ భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ, ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు 'అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్' ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి, మిర్చి సహా వాణిజ్య పంటల కొనుగోళ్లపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానంలో పంటల ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించి, అందులో అందుబాటులో ఉన్న పరికరాల వివరాలను పొందుపరచాలని సూచించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలని, వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, సజ్జల వంటి చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతులకు 7.39 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.4,085 కోట్లు చెల్లించామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని పేర్కొన్నారు. 

దీనిపై స్పందించిన సీఎం, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎన్డీఏ ప్రజాప్రతినిధులంతా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. రబీ సీజన్‌లో ప్రజలు తినే వరి రకాల సాగుతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయ మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

సీసీఐ తీరుపై సీఎం అసహనం
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'కపాస్ కిసాన్' యాప్ ద్వారా స్లాట్ల కేటాయింపులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే విషయంలో అనవసర ఇబ్బందులు సృష్టించవద్దని హెచ్చరించారు. ఈ సమస్యలపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు.

వాణిజ్య, ఉద్యాన పంటలపై దృష్టి
మిర్చి వంటి పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించేందుకు విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం అన్నారు. ధరలు ఒక్కసారిగా పడిపోకుండా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో 'రేషనలైజేషన్' విధానాన్ని పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల దశలవారీగా పంట మార్కెట్‌కు వచ్చి గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అరటి, నిమ్మ వంటి ఉద్యాన పంటల కొనుగోలుదారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సాగవుతున్న సుబాబుల్ రైతులకు మార్కెట్‌కు అనుగుణంగా ధర దక్కేలా చూడాలన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి పంటకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Agriculture Equipment Bank
Andhra Pradesh Agriculture
Farmer Welfare
Paddy Procurement
Cotton Corporation of India
Crop Planning
Irrigation
Agricultural Mechanization
MSP

More Telugu News