Kalava Srinivasulu: 18 నెలల్లో రూ.25 లక్షల కోట్లు.. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి: కాలవ శ్రీనివాసులు

Kalava Srinivasulu Says Investments Flooding Andhra Pradesh
  • చంద్రబాబు, లోకేశ్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
  • రాష్ట్రంలో 26 లక్షల ఉద్యోగావకాశాల కల్పన 
  • పెట్టుబడుల ఆకర్షణలో నారా లోకేశ్ ది కీలకపాత్ర అని కాలవ వెల్లడి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా 26 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షత, మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో దేశ, విదేశీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయి. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు కాగా, ఆయన అనుభవం రాష్ట్రానికి శ్రీరామరక్షగా మారింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సైతం పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ.25 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు జరిగాయి. అనేక పరిశ్రమల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 26 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది” అని వివరించారు.

పెట్టుబడుల ఆకర్షణలో లోకేశ్ కృషి అమోఘం

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేశ్ కీలకపాత్ర పోషిస్తున్నారని కాలవ కొనియాడారు. “ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా లోకేశ్ విద్యాశాఖలో సంస్కరణలు తెస్తూనే, పారిశ్రామికవేత్తలను కలిసేందుకు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ, వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఆయన కృషితోనే విశాఖ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాలుస్తున్నాయి” అని తెలిపారు. జగన్ అసమర్థ పాలనలో 24 శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు, నేడు పారిశ్రామికాభివృద్ధి కారణంగా 8.2 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

రెన్యూవబుల్ హబ్‌గా రాయలసీమ

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ఆ ప్రాంతం రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా వెలిగిపోతోందని కాలవ శ్రీనివాసులు అన్నారు. “గతంలో చంద్రబాబు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకొస్తే, దాని అనుబంధ సంస్థలను జగన్ ప్రభుత్వం తరిమికొట్టింది. కానీ నేడు రెన్యూ, చింతా వంటి సంస్థలతో రాయలసీమ పారిశ్రామికంగా పురోగమిస్తోంది. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడల అభివృద్ధికి కేంద్రం సహకారంతో రూ.4,900 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు లేక దాదాపు 4 వేల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

“జగన్ అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ నిబద్ధత, ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఆపలేరు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Kalava Srinivasulu
Andhra Pradesh investments
Nara Lokesh
Chandrababu Naidu
AP industrial development
Rayalaseema renewable energy
Vizag summit
TDP government
Andhra Pradesh jobs
AP economy

More Telugu News