Indian Diet: భారతీయుల ఆహారంలో పెద్ద లోపం ఇదే!... తాజా అధ్యయనంలో వెల్లడి

Indian Diet Lacks Protein Quality New Study Reveals
  • భారతీయుల ప్రోటీన్‌లో దాదాపు సగం బియ్యం, గోధుమల నుంచే
  • ఇది నాణ్యత లేని ప్రోటీన్ అని అధ్యయనంలో వెల్లడి
  • కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల వాడకం చాలా తక్కువ
  • నూనె, ఉప్పు, చక్కెర వినియోగం ప్రమాదకర స్థాయిలో పెరుగుదల
  • పదేళ్లలో 40 శాతం తగ్గిన చిరుధాన్యాల వాడకం
భారతీయుల ఆహారపు అలవాట్లపై ఓ అధ్యయనంలో ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ ప్రజలు తమకు అవసరమైన ప్రోటీన్‌లో దాదాపు సగం బియ్యం, గోధుమ, రవ్వ, మైదా వంటి ధాన్యాల నుంచే పొందుతున్నారని తాజా నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఇది నాణ్యత లేని ప్రోటీన్ అని, సులభంగా జీర్ణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలసీ రీసెర్చ్ సంస్థ 'కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్' (సీఈఈడబ్ల్యూ) ఈ అధ్యయనాన్ని బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం, భారతీయులు సగటున రోజుకు 55.6 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటున్నా, దాని నాణ్యతపైనే ప్రధాన ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల వాడకం చాలా తక్కువగా ఉండగా, వంట నూనెలు, ఉప్పు, చక్కెర వినియోగం అధికంగా ఉన్నట్లు తేలింది.

"భారత ఆహార వ్యవస్థలో ఇదొక నిశ్శబ్ద సంక్షోభం. తక్కువ నాణ్యత గల ప్రోటీన్‌పై ఆధారపడటం, ధాన్యాలు, నూనెల ద్వారా అధిక కేలరీలు తీసుకోవడం, పోషకాలున్న ఆహారాన్ని తక్కువగా తినడం వంటివి తీవ్ర అసమతుల్యతకు దారితీస్తున్నాయి" అని సీఈఈడబ్ల్యూ ఫెలో అపూర్వ ఖండేల్వాల్ తెలిపారు. పేద, ధనిక వర్గాల మధ్య ఆహార వినియోగంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని ఆమె వివరించారు.

2023-24 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే డేటా ఆధారంగా ఈ విశ్లేషణ చేశారు. గత దశాబ్ద కాలంలో జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాల వినియోగం ఏకంగా 40% పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), పీఎం పోషణ్, అంగన్‌వాడీ వంటి ప్రభుత్వ పథకాలలో కేవలం బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా.. చిరుధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, పండ్లు వంటివి కూడా చేర్చాలని అధ్యయనం సిఫార్సు చేసింది.
Indian Diet
Protein Deficiency
Counsil on Energy Environment and Water
CEEW
Apoorva Khandelwal
NSSO Survey
Public Distribution System
PM Poshan
Food Habits India

More Telugu News