DK Shivakumar: చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... రేపు తేల్చనున్న కర్ణాటక ప్రభుత్వం

DK Shivakumar on IPL Matches at Chinnaswamy Stadium Karnataka Govt Decision Tomorrow
  • చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం
  • కేఎస్‌సీఏ నూతన అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్‌తో డీకే శివకుమార్ భేటీ
  • ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • బెంగళూరు నుంచి మ్యాచ్‌లు తరలించే ప్రసక్తే లేదన్న ఉప ముఖ్యమంత్రి
  • జూన్ 4 తొక్కిసలాట ఘటన తర్వాత నిలిచిపోయిన మ్యాచ్‌ల నిర్వహణ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడనుంది. గురువారం (డిసెంబర్ 11) జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. బుధవారం బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఇతర నూతన కార్యవర్గ సభ్యులు శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, "క్రికెట్ మ్యాచ్‌లను ఆపాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ, ప్రేక్షకుల నిర్వహణ, భద్రతా చర్యలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంది. జస్టిస్ మైఖేల్ డి'కున్హా కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి వెంకటేశ్ ప్రసాద్ కూడా అంగీకరించారు" అని వివరించారు. క్రికెట్ అభిమానుల మనోభావాలను గౌరవిస్తూనే, రాష్ట్ర గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

"ఐపీఎల్ అయినా, మరే ఇతర మ్యాచ్ అయినా బెంగళూరు నుంచి తరలించడానికి మేం అంగీకరించం. ప్రభుత్వం, కేఎస్‌సీఏ కలిసి పనిచేయాలి. అవసరమైతే కొత్త స్టేడియాల నిర్మాణం గురించి కూడా చర్చిస్తాం" అని శివకుమార్ పేర్కొన్నారు. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాల మద్దతుతో ఎన్నికైన వెంకటేశ్ ప్రసాద్ బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగలేదు. నిర్వాహకులపై కేసు నమోదు కావడంతో పాటు, స్టేడియం భద్రతపై ప్రభుత్వం పూర్తిస్థాయి ఆడిట్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
DK Shivakumar
Karnataka
Chinnaswamy Stadium
IPL matches
Venkatesh Prasad
KSCA
Cricket
Bengaluru
RCB
Stadium Security

More Telugu News