Tirumala: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Tirumala Theft Case Key Orders from High Court
  • కేసు దర్యాప్తునకు సీఐడీ, ఏసీబీకి గ్రీన్ సిగ్నల్
  • నిందితుడి ఆస్తులు, లోక్ అదాలత్ రాజీపై విచారణకు ఆదేశం
  • అప్పటి టీటీడీ అధికారి పోస్టుమార్టం నివేదిక సమర్పించాలని సూచన
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్స్‌కు (డీజీలకు) వెసులుబాటు కల్పించింది.

ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీ కావడంపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను మరింత వేగవంతం చేసేందుకు, సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు న్యాయస్థానం సూచించింది. ఇది దర్యాప్తును మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది.

అదేవిధంగా, ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీటీడీ ఏవీఎన్వోగా పనిచేసిన వై. సతీశ్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని సీఐడీ అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం, కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
Tirumala
Tirumala theft case
AP High Court
Parakamani
CID investigation
ACB investigation
Y Satish Kumar
TTD
Andhra Pradesh
Tirupati

More Telugu News