Pragathi: టాలీవుడ్ నటి ప్రగతికి అభినందనలు తెలిపిన జనసేన వీరమహిళ విభాగం

Pragathi Honored by Janasena Veera Mahila for Powerlifting Win
  • అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన ప్రగతి 
  • గోల్డ్ మెడల్ సహా 4 పతకాలు కైవసం
  • ప్రగతిపై అభినందనల వర్షం
టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సహా 4 మెడల్స్ గెలుచుకుని సత్తా చాటారు. ఈ నేపథ్యంలో, ప్రగతిపై అన్ని వైపుల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా, ప్రగతి విజయగాథపై జనసేన పార్టీ వీరమహిళ విభాగం కూడా స్పందించింది. 

కళల నుంచి అంతర్జాతీయ క్రీడల వరకు బహుముఖ రంగాల్లో రాణిస్తున్న ప్రగతి వంటి మహిళలు ఎందరికో ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ వీరమహిళ విభాగం కొనియాడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

"ప్రగతి లాంటి మహిళలు శక్తి, పట్టుదల, స్ఫూర్తికి సజీవ నిదర్శనాలు. వారు అడ్డంకులను అధిగమిస్తూ, గొప్ప విజయాలు సాధిస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. వారి అంకితభావం, ధైర్యం అసంఖ్యాకమైన ఇతరులను తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహిస్తాయని తెలిపింది.

అభిరుచి, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ప్రగతి నిరూపిస్తున్నారని ప్రశంసించింది. ప్రగతి వంటి మహిళలను గౌరవించడం కేవలం వ్యక్తిగత విజయాలను గుర్తించడం మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి అంశంలో మహిళలు ప్రదర్శించే శక్తి, సామర్థ్యం, నాయకత్వ పటిమను గుర్తించడమేనని వీరమహిళ విభాగం స్పష్టం చేసింది.
Pragathi
Pragathi Actress
Asian Open Masters Powerlifting
Powerlifting Gold Medal
Janasena Party
Veera Mahila Vibhagam
Tollywood Actress
Turkey Powerlifting Competition
Sports Achievement
Indian Women Achievers

More Telugu News