నా శాఖలో 10 వేల ప్రమోషన్లు ఇచ్చాం: పవన్ కల్యాణ్

  • ఉద్యోగులతో పవన్ కల్యాణ్ మాటామంతీ
  • టీటీడీలో అవినీతిని బయటకు తీస్తామన్న డిప్యూటీ సీఎం
  • జీతాలు ఆలస్యం చేస్తున్న సర్పంచ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని, తమ ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా అర్హతకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన 'మాటామంతీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన శాఖలో పెండింగ్‌లో ఉన్న 10 వేల పదోన్నతులను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

పల్లెలే దేశానికి వెన్నెముక అనే నమ్మకంతోనే పంచాయతీరాజ్ శాఖను తాను తీసుకున్నానని పవన్ తెలిపారు. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగేనని, ప్రమోషన్ కోసం ఒక కుటుంబం ఎలా ఎదురుచూస్తుందో తనకు తెలుసని గుర్తుచేసుకున్నారు. అందుకే బాధ్యతలు చేపట్టగానే పదోన్నతులపై దృష్టి సారించానన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు చేసినా అర్హత, అనుభవం, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కొందరు ఉద్యోగులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు సకాలంలో సంతకాలు చేయకపోవడంతో జీతాలు, బిల్లులు ఆలస్యమవుతున్నాయని వాపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్, నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్‌ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిపై ఎవరు దాడులు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామన్నారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం, పరకామణి వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని చట్టంతో పాటు దేవుడు కూడా శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు.


More Telugu News