బ్రిటన్ రాజవంశానికి చెందిన సన్నీ డియోల్ భార్య... ఈ విషయాలు మీకు తెలుసా?

  • ప్రచారానికి దూరంగా ఉండే సన్నీ డియోల్ భార్య పూజా డియోల్
  • బ్రిటన్‌లో జన్మించిన పూజాకు రాజవంశ నేపథ్యం
  • కొత్త హీరో ఇమేజ్‌ కోసం పెళ్లి విషయాన్ని దాచిపెట్టిన సన్నీ
  • భర్త సినిమాకు కథ కూడా అందించిన పూజా డియోల్
  • కొడుకు సినిమాతో తొలిసారి మీడియా ముందుకు
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచుతారు. ఆయన కుటుంబం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఆయన భార్య పూజా డియోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె దాదాపు 40 ఏళ్లుగా ప్రచారానికి దూరంగా, చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు.

పూజా డియోల్ అసలు పేరు లిండా డియోల్. ఆమె 1957 సెప్టెంబర్ 21న లండన్‌లో జన్మించారు. ఆమె తండ్రి భారత సంతతికి చెందిన కృష్ణ దేవ్ మహల్ కాగా, తల్లి జూన్ సారా మహల్ బ్రిటన్‌కు చెందినవారు. ప్రముఖ మీడియా కథనాల ప్రకారం, పూజా తల్లికి బ్రిటిష్ రాజవంశంతో బంధుత్వం ఉందని చెబుతారు. దీంతో పూజాకు రాయల్ ఫ్యామిలీ నేపథ్యం ఉంది.

సన్నీ డియోల్ 1983లో ‘బేతాబ్’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయగా, ఆ మరుసటి ఏడాదే 1984లో లండన్‌లో పూజాను రహస్యంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో సన్నీ ఎదుగుతున్న స్టార్ కావడంతో పెళ్లి విషయం బయటకు తెలిస్తే ఆయన రొమాంటిక్ హీరో ఇమేజ్‌కు నష్టం కలుగుతుందని నిర్మాతలు భావించారు. ఈ కారణంగానే పెళ్లి విషయాన్ని చాలా కాలం రహస్యంగా ఉంచారు. లండన్‌కు చెందిన ఓ మ్యాగజైన్‌లో వీరి పెళ్లి ఫొటోలు ప్రచురితమయ్యే వరకు ఈ విషయం బయటకు రాలేదు.

పూజా డియోల్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు కానీ, సినీ పరిశ్రమకు తన వంతు సహకారం అందించారు. 1996లో వచ్చిన ‘హిమ్మత్’ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్ కలిసి నటించిన ‘యమ్లా పగ్లా దీవానా 2’ (2013) సినిమాకు కథను కూడా అందించారు. ఇటీవలే తన చిన్న కుమారుడు రాజ్‌వీర్ డియోల్ నటించిన ‘దోనో’ సినిమా ప్రీమియర్‌లో ఆమె తొలిసారి మీడియా ముందు మాట్లాడారు. సన్నీ, పూజా దంపతులకు కరణ్, రాజ్‌వీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.



More Telugu News