Chandrababu: మాట ఇచ్చాం... విద్యుత్ ఛార్జీలు పెంచం: సీఎం చంద్రబాబు

Chandrababu vows no power tariff hike in Andhra Pradesh
  • ప్రజలు మెచ్చేలా పాలన సాగాలని అధికారులకు సీఎం ఆదేశం
  • అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలని సూచన
  • ప్రజలపై భారం వేయం, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టీకరణ
  • గత ప్రభుత్వ నిర్వాకంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న‌దని ఆవేద‌న‌
  • రాష్ట్రంలోకి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు వస్తున్నాయని వెల్లడి
ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌ను సవరించడానికి కూడా వెనుకాడొద్దని సూచించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సూపర్ సిక్స్ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల ఫలితాలను విశ్లేషించి, రాబోయే త్రైమాసికాలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... "ప్రజల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే పరిస్థితి ఉండకూడదు, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరాలి. ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఇకపై డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా ముందుకు సాగాలి" అని పిలుపునిచ్చారు.

గత పాలకుల నిర్వాకం వల్ల 'ఏపీ బ్రాండ్' దెబ్బతిందని, అభివృద్ధి ఆగిపోయి, రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గత ప్రభుత్వ విధానాలతో కేంద్రం ఏకంగా నిబంధనలనే మార్చేసింది. ఆగిపోయిన కేంద్ర పథకాలను తిరిగి పునరుద్ధరించాం. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత వంటి పరిణామాలతో ఏపీ నాలెడ్జ్ ఎకానమీగా మారుతోందని తెలిపారు.

విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గిస్తాం
ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రజలపై భారం మోపే ప్రసక్తే లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.5.19 నుంచి రూ.4.92కి తగ్గించామని, రాబోయే ఐదేళ్లలో దీన్ని రూ.4కి తగ్గించడమే లక్ష్యమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
Chandrababu
AP government
Andhra Pradesh
electricity charges
power tariffs
data driven governance
super six schemes
AP brand
economic growth
Pawan Kalyan

More Telugu News