రాజ్యాంగాన్నే సవరించాం.. బిజినెస్ రూల్స్ మార్చలేమా?: సీఎం చంద్రబాబు

  • రాజ్యాంగాన్నే మార్చాం.. బిజినెస్ రూల్స్ మార్చితే తప్పేంటి అన్న సీఎం
  • అనవసర ఫైళ్ల సృష్టికి స్వస్తి పలకాలని అధికారులకు సూచన
  • పాలన సులభతరం చేసేందుకు టెక్నాలజీని వాడుకోవాలని పిలుపు
  • ప్రతి శాఖలో ఆడిటింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసిన చంద్రబాబు
ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్‌ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్నే సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అమరావతిలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికే స్వస్తి పలకాలి. పాలనను సులభతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధనలను తొలగించాలి" అని సూచించారు. ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటాలేక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని పిలుపునిచ్చారు.

ప్రతి శాఖలోనూ తప్పనిసరిగా ఆడిటింగ్ జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఏ అధికారి, ఏ శాఖ పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. గడిచిన 18 నెలల పాలనపై సమీక్షించుకుని, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుందామని ఆయన అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, నిర్దిష్టమైన విజన్‌తో అధికారులు పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.


More Telugu News