ఇండియాలో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు.. ఎన్ఆర్ఐ మహిళ వైరల్ వీడియో!

  • మన దేశంలో ఓ వైబ్ ఉందంటూ వ్యాఖ్య
  • పాశ్చాత్య దేశాల్లో ఫ్రెండ్ షిప్ కూడా షెడ్యుల్ ప్రకారమేనని వెల్లడి
  • స్ట్రీట్ ఫుడ్ నుంచి వైద్య సేవల దాకా.. అన్నింటా ఇండియానే గ్రేట్ అన్న ఎన్ఆర్ఐ మహిళ
మన దేశంలో ఉన్నంత సౌకర్యం ప్రపంచంలో మరెక్కడా ఉండదని, ఇండియాలో ఓ వైబ్ ఉంటుందని ఎన్ఆర్ఐ మహిళ ఒకరు పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన కంటెంట్ క్రియేటర్ తాజాగా ఇన్ స్టాలో పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో అంతా బాగానే ఉంది కానీ ఇండియాలో ఉన్న వైబ్ ఇక్కడ లేదని ఆమె చెప్పారు. ఆ మాటకొస్తే ప్రపంచంలో మరెక్కడా ఉండదని అన్నారు. కలలను సాకారం చేసుకోవడానికి దేశం విడిచి వెళ్లిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయం అనుభవంలోకి వస్తుందని ఆమె తెలిపారు.

స్ట్రీట్ ఫుడ్ విషయంలో కానీ, ఆర్డర్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో గుమ్మం ముందుకు వచ్చే వస్తువులు కానీ, వైద్య సేవల విషయంలో కానీ.. ఇలా ఏ విషయంలో చూసినా భారతదేశమే గొప్పదని ఆమె అన్నారు. ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని కలిసే అవకాశం ఇండియాలో ఉంది కానీ అమెరికాలో ముందస్తు అపాయింట్ మెంట్ లేనిదే వైద్యుడిని కలవలేమని చెప్పారు. నిశ్శబ్దంగా ఉండే ఇక్కడి రోడ్లను చూసినపుడు మన దేశంపై బెంగ కలుగుతుందని తెలిపారు. ఇక్కడ ఫ్రెండ్ షిప్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఆమె వాపోయారు.


More Telugu News