2030 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1.. భారత డెవలపర్లపై సత్య నాదెళ్ల ప్రశంసలు

  • భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్
  • ఆసియాలోనే ఇదే తమ అతిపెద్ద పెట్టుబడి అన్న సత్య నాదెళ్ల 
  • 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరిస్తుందని జోస్యం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న నాలుగేళ్లలో దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం.

బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్య నాదెళ్ల మాట్లాడుతూ... 2030 నాటికి 5.75 కోట్ల మంది డెవలపర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరించనుందని జోస్యం చెప్పారు. నూతన తరం కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. "భారతీయ డెవలపర్లు ఇప్పటికే గిట్‌హబ్, అజూర్, మా కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి అధునాతన ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు" అని ఆయన వివరించారు.

ఏఐ అప్లికేషన్లను నిర్మించేందుకు యాప్‌బిల్డర్, కోపైలట్ స్టూడియో, ఫౌండ్రీ వంటి కొత్త సాధనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇకపై ఒకే ఏఐ మోడల్‌పై కాకుండా డెవలపర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని, దానిని విశ్వాసంతో ఉపయోగించేలా ఒక విస్తృత వ్యవస్థను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రకటనకు ముందు సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్ ఏఐ అవకాశాలపై ప్రధానితో చర్చ స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలిపారు. దేశ ఏఐ భవిష్యత్తుకు మద్దతుగా, అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలను నిర్మించేందుకే ఈ భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


More Telugu News