: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్: హరీశ్ రావు

  • తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ మండిపాటు
  • ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ లో విజన్ లేదని విమర్శ
  • పెట్టుబడులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయిందని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో ఎలాంటి విజన్ గానీ, దాన్ని చేరుకునే మిషన్ గానీ లేవని, అది 'విజన్‌లెస్' డాక్యుమెంట్ అని ఎద్దేవా చేశారు.

"క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్" అంటూ హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అంకెల గారడీ తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవీ జరగడం లేదని విమర్శించారు.

గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, సమ్మిట్‌ల ద్వారా రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? వాటిలో ఎన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాయి? ఎంతమంది యువతకు ఉద్యోగాలు లభించాయి? అనే వివరాలతో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఇదే గ్లోబల్ సమ్మిట్ వేదికగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారని హరీశ్ రావు గుర్తుచేశారు. వారి ప్రశంసలే ప్రస్తుత ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News