Akhanda 2: ‘అఖండ 2’కు ఏపీ సర్కార్ మద్దతు.. చంద్రబాబు, పవన్‌కు థ్యాంక్స్ చెప్పిన నిర్మాతలు

Balakrishna Akhanda 2 Producers Thank Chandrababu Pawan for Support
  • అఖండ 2 ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
  • టికెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన నిర్మాతలు 
  • ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'అఖండ 2: తాండవం' విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శనకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌లకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ధన్యవాదాలు తెలిపింది.

ఈ మేరకు నిర్మాణ సంస్థ తమ అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. "డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సకాలంలో లభించిన మద్దతు, మా చిత్రాన్ని ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి ఎంతో దోహదపడుతుంది" అని పేర్కొంది.

వాస్తవానికి ఈ సినిమా ఈ నెల‌ 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే యూ/ఏ సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి త‌మన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గాను, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లోను నటించారు. 
Akhanda 2
Nandamuri Balakrishna
Boyapati Srinu
Chandrababu Naidu
Pawan Kalyan
Telugu cinema
14 Reels Plus
Samyuktha Menon
Adhi Pinisetty
AP Government

More Telugu News