Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ దందా

TTD Tirumala Scam Revealed Polyester Shawls Sold as Silk
  • మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాల సరఫరా
  • పదేళ్లుగా నాసిరకం శాలువాలు అందిస్తున్న సంస్థపై ఆరోపణలు
  • విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసిన భారీ మోసం
  • కుంభకోణంపై ఏసీబీ విచారణకు టీటీడీ తీర్మానం
కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస కుంభకోణాలు బయటపడటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వంటి ఘటనలు మరువక ముందే ఇప్పుడు పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారికి విరాళాలు ఇచ్చే దాతలు, వీఐపీలకు అందించే మల్బరీ పట్టు శాలువాలకు బదులుగా, ఓ సంస్థ పదేళ్లుగా 100 శాతం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీల్లో తేలింది.

వివరాల్లోకి వెళితే.. శ్రీవారిని దర్శించుకునే దాతలు, వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి, పట్టు శాలువాతో సత్కరించడం ఆనవాయతీ. దీని కోసం టీటీడీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి పట్టు శాలువాలను కొనుగోలు చేస్తుంది. అయితే, నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ అనే సంస్థ 2015 నుంచి టెండర్ దక్కించుకుని శాలువాలు సరఫరా చేస్తోంది. ఇటీవల టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ శాలువాల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, నిర్దిష్టమైన బరువు, పరిమాణంలో శాలువాలు నేయాలి. వాటిపై 'ఓం నమో వేంకటేశాయ' అనే అక్షరాలతో పాటు శంకు, చక్ర నామాలు ఉండాలి. కానీ, సరఫరా అయిన శాలువాలు పూర్తి పాలిస్టర్‌తో ఉన్నాయని తేలింది. కేవలం రూ.350 నుంచి రూ.400 విలువ చేసే ఈ నాసిరకం శాలువాలను ఒక్కొక్కటి రూ.1,389 చొప్పున టీటీడీకి విక్రయించి సంస్థ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఈ శాలువాల నమూనాలను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్‌లకు పంపించగా, అవి పాలిస్టర్‌తో తయారైనవేనని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌ను కోరింది. గతంలో కాంచీపురంలోని ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు నమూనాలను మార్పిడి చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala
TTD
Tirumala Tirupati Devasthanams
Scam
Silk Shawls
Polyester
VRS Exports
BR Naidu
Andhra Pradesh
Temple

More Telugu News