టీటీడీ సేవలపై మీ అభిప్రాయం చెప్పండిలా.. వాట్సాప్‌, ఐవీఆర్ఎస్‌ ద్వారా అవకాశం

  • భక్తుల సేవల్లో నాణ్యత పెంచేందుకు టీటీడీ చర్యలు
  • సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఫీడ్‌బ్యాక్ సేకరణ
  • శ్రీవారి సేవకులు, డయల్ యువర్ ఈవో ద్వారా కూడా సూచనలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు పలు రకాల ఫీడ్‌బ్యాక్‌ సర్వేలను ప్రారంభించింది. ఐవీఆర్ఎస్‌, వాట్సాప్‌, శ్రీవారి సేవకుల ద్వారా ఈ అభిప్రాయ సేకరణను విస్తృతం చేసింది.

ఇకపై భక్తులు తమ తిరుమల యాత్ర అనుభవాలను సులభంగా టీటీడీ దృష్టికి తీసుకురావచ్చు. ఐవీఆర్ఎస్‌ సర్వే ద్వారా అన్నప్రసాదం, వసతి, కల్యాణకట్ట, దర్శనం వంటి 17 అంశాలపై తమ ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేయవచ్చు. అలాగే, తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్‌ (నెం: 9399399399) ద్వారా కూడా అభిప్రాయాలను పంచుకోవచ్చు. టెక్స్ట్ రూపంలో 600 అక్షరాల్లో లేదా వీడియో రూపంలో తమ సూచనలను అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. సేవలకు ‘ఉత్తమం’, ‘సగటు’, ‘బాగాలేదు’ అనే రేటింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఈ నూతన పద్ధతులతో పాటు, శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకు వెళ్లి ప్రశ్నావళి ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం (0877-2263261), ఈ-మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ సలహాలను ఉన్నతాధికారులకు చేరవేయవచ్చు. ఈ మార్గాల ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి, భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. 


More Telugu News