కారుపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

  • ఫ్లోరిడా హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • వేగంగా వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
  • ప్రమాదంలో మహిళా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
  • సురక్షితంగా బయటపడ్డ పైలట్, ప్రయాణికుడు
అమెరికాలోని ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఓ చిన్న విమానం, రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... బ్రెవార్డ్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 95 హైవేపై సోమవారం ఈ సంఘటన జరిగింది. ఓ చిన్న విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా హైవేపై ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న ఓ టయోటా క్యామ్రీ కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న 57 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బ్రెవార్డ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ సిబ్బంది, ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారుల ప్రకారం విమానంలోని 27 ఏళ్ల పైలట్, మరో 27 ఏళ్ల ప్రయాణికుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
లుచు
విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది? ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అన్న వాటిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఐ-95 హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.


More Telugu News